రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా టీఎంసీ ఎంపీల లేఖ
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం మరింత ముదురుతోంది. పార్టీ లోపల నెలకొన్న విభేదాలు ఇప్పుడు పార్లమెంట్ వరకు విస్తరించాయి. ఇప్పటికే పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో 61 మంది ఎమ్మెల్యేలు పార్టీ రెబల్ నేత రితబ్రతకు మద్దతు ప్రకటించగా, ఆయనను శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా స్పీకర్ నియమించారు.
ఈ పరిణామాల మధ్య టీఎంసీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తర్వాత పార్టీకి చెందిన 20 మందికి పైగా లోక్‌సభ సభ్యులు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. దీంతో టీఎంసీలో కొనసాగుతున్న అంతర్గత పోరు కొత్త మలుపు తిరిగినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
స్పీకర్‌కు లేఖ రాసిన ఈ ఎంపీలు ప్రత్యేక గ్రూపుగా ఏర్పడే అవకాశంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇందుకోసం రెబల్ ఎంపీలు పరస్పరం మంతనాలు కొనసాగిస్తున్నారని తెలిసింది. లోక్‌సభలో టీఎంసీకి మొత్తం 28 మంది ఎంపీలు ఉన్న నేపథ్యంలో, ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందేందుకు కనీసం 20 మందికి పైగా సభ్యుల మద్దతు అవసరం. ఈ సంఖ్యాబలం సమకూర్చుకున్న నేపథ్యంలోనే స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రెబల్ ఎంపీలు త్వరలోనే లోక్‌సభలో ప్రత్యేక టీఎంసీ బ్లాక్‌గా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పార్లమెంట్లో టీఎంసీ అధికారిక బ్లాక్, రెబల్ బ్లాక్‌గా రెండు వర్గాలుగా విభజన జరిగే అవకాశంపై చర్చలు సాగుతున్నాయి.
ఇదిలా ఉండగా, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు మద్దతు విషయమై కూడా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీఎంసీకి చెందిన లోక్‌సభ సభ్యురాలు కాకోలి ఘోష్ దస్తిదార్ ప్రకారం, తనతో పాటు సుమారు 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని తెలియజేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించినట్లు ఆమె తెలిపారు.
బెంగాల్ తీర్పును మేము గౌరవిస్తున్నాం. ఎన్డీయేతో కలిసే మా భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ఉంటుంది
కాకోలి ఘోష్ దస్తిదార్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందు 13 మంది టీఎంసీ లోక్‌సభ ఎంపీలు తొలుత సుఖేందు శేఖర్ రాయ్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం వీరంతా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలుసుకున్నారు. ఈ సమావేశంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా పాల్గొన్నట్లు సమాచారం.
ఈ పరిణామాలన్నింటితో టీఎంసీ భవిష్యత్ రాజకీయ దిశ, పార్లమెంట్లో పార్టీ స్థానం, ఎన్డీయేతో సంబంధాలపై జాతీయ స్థాయిలో చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి.







