విద్యాహక్కు చట్టం సవరణకు సంబంధించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ ఫ్యాప్టో కడప జిల్లా శాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి విజ్ఞప్తి చేసింది. విద్యాహక్కు చట్టం 23వ సెక్షన్ సబ్ సెక్షన్ వన్ లో మార్పులు చేసి, ఇన్ సర్వీస్ టీచర్లను Teacher Eligibility Test (TET) నుండి మినహాయింపు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఈ విజ్ఞప్తిలో పేర్కొన్నారు.

మంగళవారం పులివెందులలోని వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో కడప జిల్లా ఫ్యాప్టో చైర్మన్ సంగమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సోదర సంఘాల బాధ్యులు కలిసి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుని కలిశారు. ఈ సందర్భంగా 2010 ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన విద్యాహక్కు చట్టం గురించి, అలాగే ఉపాధ్యాయ వృత్తిలోకి అంతకుముందు ప్రవేశించిన వారిపై Teacher Eligibility Test తప్పనిసరి చేసిన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏర్పడిన సమస్యలను నాయకులు వివరించారు.

విద్యాహక్కు చట్టం అమలును 2010 ఆగస్టు నుంచి ప్రోస్పెక్టివ్ గా మాత్రమే వర్తించేలా చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం పార్లమెంటులో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టి, ఇన్ సర్వీస్ టీచర్లకు TET నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా కేంద్రానికి ప్రతిపాదించాలని కోరారు.

ఉపాధ్యాయులకు ఒకవైపు బోధన బాధ్యతలు ఉండగా, మరోవైపు TET పరీక్షకు సిద్ధం కావడం కష్టసాధ్యంగా మారిందని నాయకులు పేర్కొన్నారు. తాము బోధించే సంబంధిత సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టుల్లో కూడా పరీక్ష రాయాల్సి రావడం వల్ల ఇన్ సర్వీస్ టీచర్లకు అదనపు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వివరించారు.

ఈ పరిస్థితుల్లో విద్యాహక్కు చట్ట సవరణే సరైన పరిష్కారమని భావిస్తున్నామని, ఆ దిశగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేయాలని ఫ్యాప్టో నాయకులు కోరారు. ఉపాధ్యాయుల సేవలను, వారి అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని, చట్టంలో తగిన మార్పులు చేయడం ద్వారా సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో జిల్లా సెక్రెటరీ జనరల్ అబ్దుల్లా, శ్యాంసుందర్ రెడ్డి, దాదా పీర్, రామాంజనేయులు, శ్రీనివాసరెడ్డి, నిహారిక, విక్టర్, శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఫ్యాప్టో తరఫున ఉపాధ్యాయుల సమస్యలను సమగ్రంగా వివరించి, చట్ట సవరణకు రాజకీయ స్థాయిలో మద్దతు కల్పించాలని నాయకులు కోరినట్లు సమాచారం.