అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని వెలమకూరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక రైతు మురళీమోహన్‌రెడ్డి (48) విద్యుదాఘాతంతో మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలమకూరుకు చెందిన మురళీమోహన్‌రెడ్డి ప్రతిరోజు వరిపొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారు. అక్కడ ఉన్న మోటర్‌ బాక్స్‌లో విద్యుత్‌ కేబుల్‌ తెగి, బాక్స్‌కు నేరుగా విద్యుత్‌ సరఫరా అవుతుండగా ఆయన గమనించలేకపోయారు. ఈ నేపథ్యంలో మోటర్‌ బాక్స్‌ను పట్టుకోవడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యారు.

విద్యుత్‌ షాక్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మురళీమోహన్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొద్దిసేపటికే విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలానికి చేరుకుని ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైపోయింది. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మృతుడికి భార్య మీనాదేవి ఉన్నారు. ఆమె గతంలో గ్రామ సర్పంచ్‌గా వ్యవహరించారు. దంపతులకు కుమారుడు ప్రదీప్‌రెడ్డి, కుమార్తె రజిత ఉన్నారు. కుటుంబంలో ఏకైక ఆదారంగా ఉన్న మురళీమోహన్‌రెడ్డి మృతి పట్ల బంధువులు, గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వెంటనే వెలమకూరుకు చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి సమస్యలను తెలుసుకుని, అవసరమైన సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

అలాగే రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ ఉంచిన మురళీమోహన్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.