రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రైఫిల్ షూటింగ్‌పై అపారమైన ఆసక్తి ఉన్నప్పటికీ సొంతూరిలో అవకాశాలు లేకపోవడంతో రాష్ట్రం దాటి సాధనకు వెళ్లిన యువకుడు బంగారు పతకంతో తిరిగి వచ్చి జిల్లాకు గౌరవం తీసుకువచ్చాడు. మదనపల్లెకు చెందిన సీడ్ మల్లికార్జున నాయుడు, అరుణల కుమారుడు శశిధర్ నాయుడు ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ చాటాడు.
రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 26వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో శశిధర్ నాయుడు తన ప్రతిభను ప్రదర్శించాడు. ఇన్ ఎయిర్, స్మాల్ బోర్, షూట్ గన్ విభాగాల్లో పోటీపడి బంగారు పతకం సాధించాడు. దీంతో మదనపల్లెకు పేరు తీసుకురావడంతో పాటు జిల్లావాసుల ప్రశంసలు అందుకున్నాడు.
సొంతూరిలో రైఫిల్ షూటింగ్‌కు అవసరమైన సదుపాయాలు, అవకాశాలు లేకపోవడంతో తనకు ఇష్టమైన ఈ క్రీడను నేర్చుకోవాలన్న తపనతో శశిధర్ నాయుడు ఊరిని, రాష్ట్రాన్ని వదిలి వెళ్లాడు. ఆరు నెలల పాటు నిరంతర సాధన చేసి పోటీలకు సిద్ధమయ్యాడు. పోటీలో ట్రిగ్గర్ నొక్కగానే తూటా లక్ష్యాన్ని ఛేదించడంతో అతనికి బంగారు పతకం వరించింది.
చిన్నప్పటి నుంచి వివిధ రకాల తుపాకులంటే ఇష్టం. అందుకే రైఫిల్ షూటింగ్ నేర్చుకోవాలనుకున్నా. డిగ్రీ పూర్తయిన తర్వాత రైఫిల్ షూటింగ్ నేర్చుకోవాలని ఆరు నెలల పాటు హైదరాబాదులో కోచ్ రాజ్‌కుమార్ వద్ద శిక్షణ తీసుకున్నాను. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఓపెన్ సైట్ 22, 50 మీటర్స్ రైఫిల్ షూటింగ్‌లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలవడంతో బంగారు పతకం వచ్చింది. త్వరలో జాతీయ స్థాయి పోటీలు జరగనున్నాయి. వాటి కోసం ఇప్పటి నుంచే సాధన ప్రారంభించాను. ఓపెన్ ఎయిర్ 300 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో రాణించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాను. అమ్మా, నాన్న ప్రోత్సాహంతో పాటు కోచ్ శిక్షణ బంగారు పతకం సాధించేలా తీర్చిదిద్దింది
శశిధర్ నాయుడు సాధించిన ఈ విజయంతో మదనపల్లె యువతలో రైఫిల్ షూటింగ్‌పై ఆసక్తి పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా సదుపాయాలు పెరిగితే మరిన్ని ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.













