ఊరిస్తున్న మామిడి.. చిత్తూరు నుంచి భారీ ఎగుమతులు

నోరూరించే మధుర ఫలం మామిడి పంటకు చిత్తూరు జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సీజన్‌లో జిల్లాలో మామిడి వ్యాపారం క్రమంగా ఊపందుకుంటోంది. ముఖ్యంగా టేబుల్‌ రకాల మామిడి ధరలు శుక్రవారం కొంత ఆశాజనకంగా ఉండటంతో రైతులకు ఊరట కలిగింది.

చిత్తూరులోని మామిడి కాయల మార్కెట్‌ యార్డులో టేబుల్‌ రకాల మామిడి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. బేనీషా, మల్లిక, కాలేపాడు, హిమామ్‌పసంద్, నీలం, కలర్‌ తోతాపురి వంటి టేబుల్‌ రకాల మామిడిని వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన ఎగుమతిదారులు, వ్యాపారులు బేనీషా, తోతాపురి లైన్‌ కాయలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.

ప్రతి రోజు కనీసం 750 నుంచి 1,000 టన్నుల వరకు బేనీషా మామిడి కాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయని మండీ యజమానులు వెల్లడిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది టేబుల్‌ మామిడి రకాల ఎగుమతులు ఎన్నడూ లేనంతగా పెరిగాయని వారు పేర్కొంటున్నారు.

ఇప్పటి వరకు సుమారు 15 నుంచి 17 వేల టన్నుల టేబుల్‌ మామిడి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయినట్లు మండీ యజమానులు తెలిపారు. ఎగుమతులు పెరగడంతో మార్కెట్‌లో టేబుల్‌ రకాల ధరలు కూడా మెరుగ్గా ఉండటంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు మామిడి కాయల యార్డును మార్కెటింగ్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పరమేశ్వరన్‌ ప్రతిరోజూ పరిశీలిస్తున్నారు. కాయల నాణ్యత, ధరల స్థితిగతులు, వ్యాపారుల రాకపోకలు తదితర అంశాలపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

ప్రస్తుత మామిడి సీజన్‌ జులై 10 నుంచి 15 వరకు కొనసాగుతుందని, ఆవరకు టేబుల్‌ రకాల మామిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మామిడి మండీ యజమానుల అసోసియేషన్‌ అధ్యక్షుడు నందగోపాల్‌ తెలిపారు. ఎగుమతుల ఊపు, దేశీయ డిమాండ్‌ దృష్ట్యా రైతులకు ఈ సీజన్‌ లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.