పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులు, గ్రామస్తులు ఐకమత్యంగా ఉండి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ పిలుపునిచ్చారు. కుప్పం మండలంలోని పొగురుపల్లి గ్రామంలో పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులు, గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు లేవనెత్తిన సమస్యలను కలెక్టర్‌ శ్రద్ధగా వినిపించుకున్నారు. మొత్తం 33 సమస్యలను అధికారులు నమోదు చేయగా, వాటి పరిష్కారంపై అక్కడికక్కడే చర్చించి తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించాలని సూచించారు.

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ మాట్లాడుతూ రైతులు, గ్రామస్తులు ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని అన్నారు. కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలమని, ఐకమత్యంతో ముందుకు సాగితే గ్రామం, ప్రాంతం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తుందని పేర్కొన్నారు. పెద్ద ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు ఈ ప్రాంతం ఎంపిక కావడం అభివృద్ధికి పెద్ద అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు.

పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, రహదారులు, విద్యుత్‌, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు మెరుగుపడతాయని కలెక్టర్‌ వివరించారు. పరిశ్రమల వల్ల కలిగే లాభాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి ప్రక్రియలో ఎవరికీ అన్యాయం జరగకుండా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.