రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి:
తడబడి వరదనీటి వినియోగంపై మళ్లీ చర్చ
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులకు వరదనీటి రూపంలో వరంగా నిలిచే తుంగభద్ర జలాశయానికి మళ్లీ మంచి రోజులు వచ్చినట్టు ఆయకట్టు రైతులు భావిస్తున్నారు. జలాశయం నుంచి వృథాగా సముద్రం చేరుతున్న వరదనీటిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన మరోసారి ముందుకు వచ్చింది. నదీ పరివాహక ప్రాంతాలైన మూడు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఒకే వేదికపై చర్చించి నిర్ణయానికి వస్తే మధ్యభారత్ వ్యవసాయ రంగానికి భారీగా లాభం చేకూరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నవీకరించిన తుంగభద్ర ఆనకట్ట స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి హాజరు అయ్యారు . వీరితో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్, పలు రంగాల నిపుణులు కూడా తుంగభద్రకు హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో వరదనీటి వినియోగంపై పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు మళ్లీ చర్చకు రావడం విశేషం.
తుంగభద్ర జలాశయం నుంచి ప్రతి ఏడాది కనిష్ఠంగా 150 టీఎంసీలు, గరిష్ఠంగా 400 టీఎంసీల వరదనీరు వృథాగా దిగువకు విడుదల అవుతోంది. ఈ నీటిని మళ్లించేందుకు నాలుగు దశాబ్దాలుగా హెచ్చెల్సీ కాలువకు సమాంతరంగా వరద కాలువ నిర్మాణ ప్రతిపాదన పెండింగ్‌లోనే ఉంది. అలాగే కర్ణాటకలోని కొప్పళ జిల్లా నవలి గ్రామం వద్ద నవలి జలాశయం నిర్మాణం మరో కీలక ప్రతిపాదనగా నిలిచింది. మూడు రాష్ట్రాల పాలకులు కూర్చొని చర్చించకపోవడంతో ఈ రెండింటిలో ఏదీ కార్యరూపం దాల్చలేదు.
ఇప్పుడు జలాశయానికి కొత్తగా అమర్చిన 33 స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ప్రతిపాదనలపై మళ్లీ చర్చ మొదలైంది. వరద కాలువ, నవలి జలాశయం ప్రాజెక్టులు అమలైతే తుంగభద్ర పరివాహక ప్రాంతంలో నీటి భద్రత పెరిగి, లక్షలాది మంది రైతులకు జలభద్రగా నిలుస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
తుంగభద్ర నుంచి వృథా వరదనీటిని కరవు పీడిత రాయలసీమతో పాటు కర్ణాటకలోని కొన్ని జిల్లాలకు మళ్లించాలనే ఆలోచన కొత్తది కాదు. పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తన కాలంలోనే హెచ్చెల్సీ సమాంతర వరద కాలువ నిర్మాణంపై తుంగభద్ర మండలి, కర్ణాటక ప్రభుత్వాలకు లేఖ రాసి చర్చలు జరిపించారు. అయితే ఆ ప్రతిపాదన కాగితాలకే పరిమితమై ఆచరణలోకి రాలేదు.
ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం వరదనీటిని రాయలసీమలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో నిల్వ చేయడంతో పాటు బొమ్మనహళ్ మండలం ఉంతకల్లు వద్ద ఐదు టీఎంసీల సామర్థ్యంతో కొత్త జలాశయం నిర్మించాలని సూచించారు. ఇవన్నీ అమలైతే తుంగభద్ర వరదనీరు వృథా కాకుండా సాగునీటి అవసరాలకు ఉపయోగపడే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడైనా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రితో కలిసి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేస్తే, తుంగభద్ర జలాశయం నిజమైన జలభద్రగా మారే అవకాశం ఉందన్న ఆశ రైతుల్లో వ్యక్తమవుతోంది.













