కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఐ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక, నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తృత ప్రచార, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆగస్టు 6 నుంచి 15 వరకు రాష్ట్రంలోని 28 జిల్లాలన్నింటిలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వివరించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని 12 ఏళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోందని వ్యాఖ్యానించారు.

ఓటర్ల పునర్వ్యవస్థీకరణ పేరుతో తీసుకొచ్చిన "సర్" ప్రక్రియ ద్వారా ఇప్పటికే 18 రాష్ట్రాల్లో 6.5 కోట్ల మందిని ఓటరు జాబితా నుంచి తొలగించారని, మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలోపు 20 కోట్ల మందిని తొలగించాలనే లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకాలేదని, RTC ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారని, 1,400 బస్సులను ప్రైవేటు చేతులకు అప్పగించే యోచనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. RTC ఆస్తులు, ప్రభుత్వ భూములను లులు మాల్స్ వంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

రాయలసీమలో కడప స్టీల్ ప్లాంట్ , ప్రకాశం జిల్లా NIMS, దొనకొండ పారిశ్రామిక వాడ అభివృద్ధి నిలిచిపోయిందని, ఉత్తరాంధ్ర లో విజయనగరం పరిసరాల్లో ఫెర్రో Alloys కంపెనీలు మూతపడుతున్నాయని ఆయన వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరుస్తూ, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు ప్రోత్సాహం ఇస్తున్న ధోరణిని ఆయన ఖండించారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి జూన్ 30న "చలో విజయవాడ" కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గారి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్. నాగ సుబ్బారెడ్డి, ఎన్. వెంకట శివ, ఎం.వి. సుబ్బారెడ్డి, బి. వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు.