రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: శ్రీసత్యసాయి జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తొలి స్నాతకోత్సవం బుధవారం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు. స్నాతకోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పుట్టపర్తి నుంచి విశ్వవిద్యాలయానికి చేరుకునే మార్గంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు.
రాష్ట్రపతి హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకు ప్రయాణించే మార్గంలో కాన్వాయ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కేంద్ర బలగాలు ఇప్పటికే కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకుని భద్రతా చర్యలను అమలు చేస్తున్నాయి. విశ్వవిద్యాలయం చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్‌గా, నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ వివరించారు.
స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా హాజరుకానున్నారు. మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న గవర్నర్‌కు శ్రీసత్యసాయి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీశ్ కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, ఆర్డీవో సువర్ణ విమానాశ్రయంలో గవర్నర్‌ను ఆహ్వానించారు.
బుధవారం ఉదయం 8.50 గంటలకు పుట్టపర్తిలోని శ్రీనివాస గెస్ట్ హౌస్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గవర్నర్ బయలుదేరి, ఉదయం 10.20 గంటలకు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు హెలిప్యాడ్ వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలికారు . ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్రపతితో కలిసి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్యాశాఖ మంత్రి లోకేశ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బుధవారం ఉదయం 7.20 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి, ఉదయం 8 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఉదయం 8.15 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి, 10 గంటలకు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు . మధ్యాహ్నం 12 గంటల వరకు స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తొలి స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వవిద్యాలయ సభావేదికను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆహ్వానితుల రాకను దృష్టిలో పెట్టుకుని భద్రతా, శ్రేణి, వసతి, రవాణా తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో పూర్తి చేశాయి. శ్రీసత్యసాయి జిల్లాలో జరుగుతున్న ఈ తొలి స్నాతకోత్సవం దేశవ్యాప్తంగా విద్యార్థుల దృష్టిని ఆకర్షిస్తోంది.













