రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి:
పుట్టపర్తి నియోజకవర్గంలో వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక సమావేశం
ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో పుట్టపర్తి నియోజకవర్గంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని వ్యవసాయ అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రైతులకు అవసరమైన సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు, ఎరువులు సమయానికి, తగిన మోతాదులో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులు సూచించారు. ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు, ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో నిల్వలు, పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేయాలని ఆమె ఆదేశించారు.
రైతుల అవసరాలు, సమస్యలను గ్రామ స్థాయిలోనే గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఎమ్మెల్యే కోరారు. రైతులకు అందించే సబ్సిడీ విత్తనాలు, ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రతి రైతుకూ ప్రయోజనం చేకూరేలా చూడాలని సూచించారు.
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సబ్సిడీల గురించి ప్రతి రైతుకూ అవగాహన కల్పించేందుకు గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు. రైతులు సమయానికి విత్తనాలు, ఎరువులు పొందేలా వ్యవసాయ శాఖ, సహకార సంఘాలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, రైతు సంక్షేమం ప్రభుత్వానికి ప్రాధాన్యమని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయకారిగా ఉంటుందని, ఖరీఫ్ సీజన్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
సమావేశంలో వ్యవసాయ అధికారులు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లు, విత్తనాలు, ఎరువుల లభ్యతపై ఎమ్మెల్యేకు వివరాలు అందించారు. రైతులకు సేవలందించడంలో మరింత చురుకుదనం ప్రదర్శించాలని, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం.













