తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయుల అరాచకాలు, దౌర్జన్యాలకు నిరసనగా వైయస్ఆర్‌సీపీ పోరుబాట ప్రారంభించింది. ఈ నెల 26వ తేదీన తాడిపత్రి గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ఈ ఉద్యమాన్ని చేపడుతున్నామని వైయస్ఆర్‌సీపీ నేతలు తెలిపారు.

స్థానికంగా శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలపై దాడులు, రాజకీయ వేధింపులు పెరిగిపోయాయని వారు ఆరోపించారు. తాడిపత్రిలో జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వైయస్ఆర్‌సీపీ నేతలు అభిప్రాయపడ్డారు.

బుధవారం అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. తాడిపత్రి పరిస్థితులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

గంగులకుంట కేశవరెడ్డిపై జరిగిన హత్యాయత్నం దారుణమని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఘటన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిపై కూడా దాడి జరగడం అత్యంత ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పుచేతల్లో పోలీసులు పనిచేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

అనంతపురం ఎస్పీ జగదీష్ హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని, ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. ఇది పోలీస్ వ్యవస్థ అసమర్థతకు నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. చట్టసవ్యస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటోందని, దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమేనని నేతలు అభిప్రాయపడ్డారు.

తాడిపత్రిలో జరుగుతున్న దౌర్జన్యాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించే బాధ్యతను ప్రభుత్వం, పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ నేతలు కోరుతున్నారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని వైయస్ఆర్‌సీపీ స్పష్టం చేసింది.